జ్యోతిర్లింగముల ఉపలింగములు
మహానది సముద్రములో కలియు చోట గల అంతకేశ్వరుడను లింగము సోమేశ్వరుని ఉపలింగము. భృగుకక్షమునందు గల, సుఖములనిచ్చే రుద్రేశ్వరలింగము మల్లికార్జునుని నుండి ఉద్భవించుటచే దానికి ఉపలింగమగును . మహాకాలేశ్వరునినుండి ఉద్భవించి నర్మదానదీతీరమున దుగ్థేశ్వరుడని ప్రఖ్యాతిని గాంచిన లింగము సర్వుల పాపములను పోగొట్టునని ఋషులచే చెప్పబడినది.
ఓం కారేశ్వరునినుండి ఉద్భవించి కర్దమేశుడని ప్రసిద్ధిని గాంచిన లింగము బిందుసరస్సునందు ఉన్నదై సర్వుల కోర్కెలను ఈడేర్చుచూ ఫలములనిచ్చుచున్నది. యమునాతీరమునందు కేదారేశ్వరునినుండి ఉద్భవించిన భూతేశ్వరుడు తనను దర్శించినవారికి, అర్చించినవారికి మహాపాపములను పోగొట్టునని చెప్పబడినది.
సహ్యపర్వతమునందు భీమశంకరుని ఉద్భవించిన భీమేశ్వరుడు గొప్ప బలమును వర్ధిల్లజేయునని మహర్షులచే చెప్పబడినది . మల్లికారసరస్వతీ తీర మునందు గల, నాగేశ్వరునినుండి ఉద్భవించిన భూతేశ్వరుడు దర్శనము చేతనే పాపములను పోగొట్టునని చెప్పబడినది . రామేశ్వరుని నుండి ఉద్భవించిన లింగము గుప్తేశ్వరుడనియు, ఘ్ముశ్మేశ్వరుని నుండి వ్యాఘ్రేశ్వరుడు ఉద్భవించెననియు మహర్షులు చెప్పినారు.
శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు జ్యోతిర్లింగములను, వాటి ఉపలింగములను వర్ణించే మొదటి అధ్యాయము నుండి.
No comments:
Post a Comment