శ్రీ వీరేశ్వరాభిలాషాష్టకం - శ్రీ శివమహాపురాణము
విశ్వానర ఉవాచ .
ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాఽస్తి కిం తు .
ఏకో రుద్రో న ద్వితీయోఽవతస్థే తస్మాదేకం తత్త్వాం ప్రపద్యే మహేశం .. 1..
ఏకః కర్తా త్వం హి సర్వస్య శంభో నానారూపేష్వేకరూపోఽప్యరూపః .
యద్వత్ప్రత్యగ్ధర్మ ఏకోఽప్యనేకస్తస్మాన్నాన్యం త్వాం వినేశం ప్రపద్యే .. 2..
రజ్జౌ సర్పః శుక్తికాయాం చ రౌప్యం నైరః పూరస్తన్మృగాఖ్యే మరీచౌ .
యద్యత్తద్వద్విష్వగేషః ప్రపంచో యస్మిన్ జ్ఞాతే త్వాం ప్రపద్యే మహేశం .. 3..
తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ తాపో భానౌ శీతభానౌ ప్రసాదః .
పుష్పే గంధో దుగ్ధమధ్యేఽపి సర్పిర్యత్తచ్ఛంభో త్వం తతస్త్వాం ప్రపద్యే .. 4..
శబ్దం గృహ్ణాస్యశ్రవాస్త్వం హి జిఘ్రేరఘ్రాణస్త్వం వ్యంఘ్రిరాయాసి దూరాత్ .
వ్యక్షః పశ్యేస్త్వం రసజ్ఞోఽప్యజిహ్వః కస్త్వాం సమ్యగ్వేత్త్యతస్త్వాం ప్రపద్యే .. 5..
నో వేదస్త్వామీశ సాక్షాద్వివేదో నో వా విష్ణుర్నో విధాతాఽఖిలస్య .
నో యోగీంద్రా నేంద్రముఖ్యాశ్చ దేవా భక్తో వేదస్త్వామతస్త్వాం ప్రపద్యే .. 6..
నో తే గోత్రం నాపి జన్మాపి నాఖ్యా నో వా రూపం నైవ శీలం న తేజః .
ఇత్థం భూతోఽపీశ్వరస్త్వం త్రిలోక్యాః సర్వాన్కామాన్పూరయేస్త్వం భజే త్వాం .. 7..
త్వత్తత్సర్వం త్వం హి సర్వం స్మరారే త్వం గౌరీశస్త్వం చ నగ్నోఽతిశాంతః .
త్వం వై వృద్ధస్త్వం యువా త్వం చ బాలస్తత్కిం యత్త్వం నాస్యతస్త్వాం నతోఽహం .. 8..
విశ్వానరుడిట్లు పలికెను-
బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగతభేదములు లేని పూర్ణ సత్యతత్త్వము. ఈ నానాత్వము కన్పట్టునదియే గాని సత్యము గాదు. రుద్రుడు ఒక్కడే గలడు.రెండవ తత్త్వము లేదు. కావున అద్వయుడవు, మహేశుడవు అగు నిన్ను శరణు జొచ్చుచున్నాను (1).
హే శంభో! సర్వమును సృష్టించి లయము చేయువాడవు నీవే. వివిధరూపములలో అఖండసత్తారూపములో నుండే నీకు రూపము లేదు. ప్రత్యగాత్మ స్వరూపుడవగు నీవు అద్వయుడవైననూ అనేకముగ కన్పట్టు చున్నావు. కావున ఈశ్వరుడవగు నిన్ను తక్క ఇతరమును నేను శరణు పొందుట లేదు (2).
త్రాడు నందు పాము, ముత్యపు చిప్ప యందు వెండి, ఎండమావుల యందు నీరు ఎట్లు మిథ్యయో, అటులనే సద్ఘనుడవగు నీ యందు విశ్వము మిథ్యయగును. దేనిని తెలిసినచో ప్రపంచము తత్త్వతః తెలిసినట్లు యగునో, అట్టి మహేశుని శరణు పొందుచున్నాను (3).
నీటియందలి చల్లదనము, నిప్పుయందలివేడి, సూర్యుని యందలి తాపము, చంద్రుని యందలి ఆహ్లాదకత్వము, పుష్పమునందలి పరిమళము, పాలలోని వెన్న నీవే. కావున, హే శంభో! నిన్ను నేను శరణు వేడుచున్నాను (4).
నీవు శబ్దమును వినెదవు. కాని నీకు చెవులు లేవు. నీవు ఆఘ్రాణించెదవు. కాని నీకు ముక్కులేదు. నీకు పాదము లేకున్ననూ దూరమునుండి వచ్చెదవు. కన్నులు లేని నీవు చూచుచున్నావు. జిహ్వ లేని నీవు రుచిని తెలియుచున్నావు. నీ స్వరూపమును పూర్ణముగాఎవరు ఎరుంగగలరు? కావున నిన్ను శరణు వేడుచున్నాను (5).
ఓ ఈశ్వరా! వేదము సాక్షాత్తుగా నిన్ను ఎరుంగక జాలదు. విష్ణువు గాని, సర్వమును సృజించు బ్రహ్మగాని నిన్ను యెరుంగరు. యోగిశ్రేష్ఠులు, ఇంద్రాదిదేవతలు నిన్ను ఎరుంగరు. కాని, భక్తుడు నిన్ను తెలియగల్గును. కావున నిన్ను శరణు పొందుచుచున్నాను (6).
నీకు గోత్రములేదు. జన్మనాశములు లేవు. నీకు రూపము లేదు. శీలము లేదు. దేశము లేదు. ఇట్టివాడవైననూ, నీకు ముల్లోకములకు ప్రభుడవు. నేను నిన్ను సేవించుచున్నాను నాకోర్కెలనన్నిటినీ ఈడేర్చుము (7).
ఓ మన్మథాంతకా! సర్వము నీనుండి ఉద్భవించినది. సర్వము నీవే. గౌరీపతివి నీవు. దిగంబరుడవు అగు నీవు పరమ శాంత స్వరూపుడవు. వృద్ధుడవు నీవే. యువకుడవు నీవే. బాలుడవు నీవే. నీచే వ్యాప్తము కాని తత్త్వము ఏది గలదు? నేను నిన్ను నమస్కరించుచున్నాను (8).
స్తుత్వేతి భూమౌ నిపపాత విప్రః స దండవద్యావదతీవ హృష్టః .
తావత్స బాలోఽఖిలవృద్ధవృద్ధః ప్రోవాచ భూదేవ వరం వృణీహి ..
ఆ బ్రాహ్మణుడు ఇట్లు స్తుతించి చేతులను కట్టుకొని సాష్టాంగ ప్రణామము నాచరించునంతలో, వృద్ధులందరిలో వృద్ధుడగు ఆ బాలుడు మిక్కిలి ఆనందించి ఆ బ్రాహ్మణునితో నిట్లనెను
తత ఉత్థాయ హృష్టాత్మా మునిర్విశ్వానరః కృతీ .
ప్రత్యబ్రవీత్కిమజ్ఞాతం సర్వజ్ఞస్య తవ ప్రభో ..
అపుడు కృతార్థుడైన విశ్వానరమహర్షి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై లేచి నిలబడి బాలుని రూపములోనున్న శంకరునకు ఇట్లు బదులిడెను.
మహేశ్వర కిమజ్ఞాతం సర్వజ్ఞస్య తవ ప్రభో
సర్వాంతరాత్మా భగవాన్సర్వః సర్వప్రదో భవాన్ .
యాత్రాప్రతినియుక్తే మాం కిమీశో దైన్యకారిణీం .
ఇతి శ్రుత్వా వచస్తస్య దేవో విశ్వానరస్య హ .
శుచిః శుచివ్రతస్యాథ శుచిస్మిత్వాబ్రవీచ్ఛిశుః ..
మహేశ్వర ప్రభూ! సర్వజ్ఞుడవగు నీకు తెలియనది ఏమున్నది? నీవు సర్వుల అంతరంగములో నుండే భగవానుడవు. సర్వమును ఇచ్చే శర్వుడవు. అయిననూ, నీవు నన్ను దైన్యమును కలిగించే యాచనయందు ఏల నియోగించుచున్నావు? ఓ మహేశ్వరా! సర్వము నీకు తెలియును. కావున నీకు తోచినట్లు చేయుము.
బాల ఉవాచ .
త్వయా శుచే శుచిష్మత్యాం యోఽభిలాషః కృతో హృది .
అచిరేణైవ కాలేన స భవిష్యత్యసంశయః ..
తవ పుత్రత్వమేష్యామి శుచిష్మత్యాం మహామతే .
ఖ్యాతో గృహపతిర్నామ్నా శుచిః సర్వామరప్రియః ..
అభిలాషాష్టకం పుణ్యం స్తోత్రమేతత్త్వయేరితం .
అబ్దం త్రికాలపఠనాత్కామదం శివసన్నిధౌ ..
ఏతత్స్తోత్రస్య పఠనం పుత్రపౌత్రధనప్రదం .
సర్వశాంతికరం చాపి సర్వాపత్పరినాశనం ..
స్వర్గాపవర్గసంపత్తికారకం నాత్ర సంశయః .
ప్రాతరుత్థాయ సుస్నాతో లింగమభ్యర్చ్య శాంభవం ..
వర్షం జపమిదం స్తోత్రమపుత్రః పుత్రవాన్భవేత్ .
వైశాఖే కార్తికే మాఘే విశేషనియమైర్యుతః ..
యః పఠేత్స్నానసమయే లభతే సకలం ఫలం .
కార్తికస్య తు మాసస్య ప్రసాదాదహమవ్యయః ..
తవ పుత్రత్వమేష్యామి యస్త్వన్యస్తత్పఠిష్యతి .
అభిలాషాష్టకమిదం న దేయం యస్య కస్యచిత్ ..
గోపనీయం ప్రయత్నేన మహావంధ్యాప్రసూతికృత్ .
స్త్రియా వా పురుషేణాపి నియమాల్లింగసన్నిధౌ ..
అబ్దం జపమిదం స్తోత్రం పుత్రదం నాత్ర సంశయః .
ఇత్యుక్త్వాంతర్దధే బాలః సోపి విప్రో గృహం గతః ..
శుద్ధవ్రతుడగు ఆ విశ్వానరుని ఈ మాటను విని పవిత్ర శిశురూపములో నున్న శివదేవుడు చిరునవ్వుతో అపుడిట్లనెను (. ఓయీ పవిత్రుడా! నీవు ఎట్టి పుత్రుని శుచిష్మతియందు బడయవలెనని హృదయములో కోరుకుంటివో, అట్టి పుత్రుడు శీఘ్రముగా నిస్సంశయముగా లభించగలడు . ఓ మహాత్మా! నేను శుచిష్మతి యందు నీ పుత్రుడనై జన్మించి గృహపతి యను పేరుతో ప్రసిద్ధిని గాంచి పావనుడనై దేవతలందరికీ ప్రియుడను కాగలను. నీవు పలికిన అభిలాషాష్టకమను పేరు గల పవిత్రమగు ఈ స్తోత్రమును శివుని సన్నిధిలో మూడు కాలములయందు సంవత్సరకాలము పఠించినచో కోర్కెలు ఈడేరును. ఈ స్తోత్రమును పఠించినచో పుత్రులు, పౌత్రులు, ధనము లభించి ఆపదలన్నియు దూరమై సంపూర్ణమగు శాంతి కలుగును. ఈ స్తోత్రము స్వర్గమోక్షములను, సంపదను ఇచ్చుననుటలో సందేహము లేదు. సర్వదా కోర్కెలనన్నిటినీ ఈడేర్చు ఈ ఒక్క స్తోత్రము ఇతరస్తోత్రములన్నింటితో సమమైనది.
సంవత్సరకాలము ఉదయమే నిద్ర లేచి చక్కగా స్నానము చేసి శంభుని లింగమును పూజించి ఈ స్తోత్రమును జపించినచో, పుత్రుడు లేని వానికి పుత్రుడు కలుగును. ఈ అభిలాషాష్టకమును ఎవడు కనబడితే వానికి చెప్పరాదు. దీర్ఘకాల వంధ్యయైననూ ప్రసవించునట్లు చేయగల ఈ స్తోత్రమును శ్రద్ధతో పరిరక్షించవలెను. స్త్రీగాని, పురుషుడు గాని లింగసన్నిధిలో నియమపూర్వకముగా సంవత్సరకాలము ఈ స్తోత్రమును జపించినచో, నిస్సంశయముగా పుత్రుడు కలుగును. సత్పురుషులకు శరణ్యుడు, బాలరూపములో నున్న వాడు అగు శంభుడు ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. ఆ విశ్వానరమహర్షి కూడా ఆనందముతో నిండిన మనస్సు గలవాడై తన ఇంటికి చేరుకొనెను.
శ్రీ శివ మహాపురాణములోని శతరుద్ర సంహితయందు గృహపత్యవతారవర్ణనమనే పదమూడవ అధ్యాయము
No comments:
Post a Comment