Friday, December 11, 2020

ద్వాదశ జ్యోతిర్లింగములు

 ద్వాదశ జ్యోతిర్లింగములు





సౌ రాష్ట్రే సోమనాథశ్చ శ్రీ శైలే మల్లికార్జునః | ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారే చామరేశ్వరః || 

కేదారో హిమవత్పృష్ఠే డాకిన్యాం బీమ శంకరః | వారాణస్యాం చ విశ్వేశస్త్ర్యంబకో గౌతమీతటే || 

వైద్యనాథశ్చితా భూమౌ నాగేశో దారుకావనే | సేతుబంధే చ రామేశో ఘుశ్మేశశ్చ శివాలయే || 

అవతారద్వాదశకమేతచ్ఛంభోః పరాత్మనః | సర్వానందకరం పుంసాం దర్శనస్పర్శనాన్మునే || 


సౌరాష్ట్ర దేశములో సోమనాథుడు, శ్రీశైలములో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాలుడు, ఓంకారములో అమరేశ్వరుడు . హిమవచ్చిఖరముపై కేదారేశ్వరుడు, డాకినిలో భీమశంకరుడు, వారాణసిలో విశ్వేశుడు, గౌతమీ తీరమునందు త్ర్యండకుడు , చితాబూమిలో వైద్యనాథుడు, దారుకావనములో నాగేశుడు, సేతు బంధములో రామేవుడు, శివాయములో ఘుశ్మేశుడు  అనునవి పరమాత్మయగు శంభుని పన్నెండు అవతారములు. ఓ మునీ! ఈ లింగములు మానవులకు స్పృశించుటచే మరియు దర్శించుటచే సర్వానందములనిచ్చును. 



ఓ మునీ! వాటిలో మొదటిది సోమనాథుడు. ఆయన చంద్రుని దుఃఖమును పోగొట్టినాడు. ఆయనను పూజించినచో క్షయ, కుష్ఠ ఇత్యాది రోగములు తొలగిపోవును . శివుడు పూర్వము మంగళకరమగు సౌరాష్ట్రదేశములో లింగరూపములో ఆవిర్బవించగా చంద్రుడు ఆయనను అర్చించెను 


అచటనే సర్వపాపములను పోగొట్టే చంద్రకుండము గలదు. బుద్ధి మంతుడగు మానవుడు దానియందు స్నానము చేసి రోగములన్నిటినుండి విముక్తిని పొందవచ్చును . పరమాత్మ స్వరూపమగు శివుని సోమేశ్వరమహాలింగమును దర్శించు మానవుడు పాపమునుండి విముక్తిని భక్తిని మరియు ముక్తిని పొందును. . వత్సా! భక్తుల అభీష్టఫలములనిచ్చు శంకరుడు శ్రీగిరియందు మల్లికార్జునుడను పేరుతో అవతరించెను. ఇది రెండవ జ్యోతిర్లింగము . పుత్రసంతానమును కోరువారు లింగరూపములో నున్న మల్లికార్జునుని స్తుతించెదరు. ఓ మునీ! శివుడు తన కైలాసమునండి శ్రీ శైలమునకు మహానందముతో విచ్చేసెను . ఓ మునీ! ఆ రెండవ జ్యోతిర్లింగమును దర్శించి పూజించువారికి మహాసుఖములు కలుగుటయే గాక మరణించిన పిదప ముక్తి లభించుననుటలో సందియము లేదు . వత్సా! తన భక్తులను మహాకాలుడను పేర కాపాడే శివుని అవతారము ఉజ్జయినీ నగరములో ఆవిద్బవించెను . దూషణడను రాక్షసుడు వేదధర్మమును నశింపజేయువాడై బ్రాహ్మాణులను ద్వేషిస్తూ ఉజ్జయినిలో గల సర్వమును నాశనము చేసెను. అపుడు బ్రాహ్మణులు వారి పుత్రులు వేదములతో శివుని ప్రార్థించగా ఆయన వెంటనే రత్నమాల నగర నివాసియగు ఆ దూషణుని హుంకారముచే భస్మము చేసెను , . తన భక్తులను రక్షించే ఆ మహాకాలుడు దేవతలచే ప్రార్థింపబడినవాడై అచటనే జ్యోతిర్లింగరూపములో ఆవిర్భవించి స్థిరముగా నుండెను .



మహాకాలేశ్వరలింగమును దర్శించి శ్రద్ధతో అర్చించు మానవుడు సమస్తమైన అభీష్టములను పొందుటయే గాక, మరణించిన పిదప ఉత్తమ గతిని పొందును . శంభుపరమాత్మ ఓంకారేశ్వరుని రూపములో కూడ అవతరించినాడు. ఈ నాల్గవ అవతారము భక్తులకు ఫలము నిచ్చి కోర్కెలనీడేర్చుచున్నది . వింధ్యుడు యథావిధిగా శివలింగమును స్థాపించి భక్తితో అర్చించెను. ఓ మునీ! ఆ పార్థివలింగము నుండి మహాదేవుడు ఆవిర్బవించి వింధ్యుని కోర్కెను తీర్చెను . లింగరూపములో భక్తులకు భుక్తిని ముక్తిని ఇచ్చువాడు, భక్తప్రియుడునగు శివుడు దేవతల ప్రార్థనను మన్నించి అచట రెండు రూపములలో ఆవిర్బవించెను . ఓ మహర్షీ! వాటిలో ఒకటి ఓంకారములో ఓంకారేశ్వరుడను పేర ఆవిర్భవించిన ఉత్తమలింగము. పరమేశ్వరుడు అను పేరు గల పార్థివలింగము రెండవది . ఓ మహర్షీ! పైన వర్ణింపబడిన మహాదివ్యములగు ఈ రెండు జ్యోతిర్లింగములలో ఏ ఒక్కదానినైననూ దర్శించి అర్చించు భక్తుల అభీష్టములను పరమేశ్వరుడు తీర్చును . పరమశివుడు కేదారమునందు కేదారేశ్వరుడను పేర అయిదవ జ్యోతితర్లింగముగా అవతరించి యున్నాడు .



ఓ మహర్షీ! హిమవత్పర్వతమునందలి కేదారములో హరియొక్క అవతారములగు నరనారాయణులు గలరు. వారు మరియు అచటనున్న ఇతరులు ప్రార్థించగా శివుడు అచట కేదారేశ్వరనామముతో అవతరించి ప్రతిదినము వారిద్దరి పూజలనందుకొనుచున్నాడు. కేదారేశ్వరుని దర్శించి అర్చించు భక్తుల కోర్కెలను శంభుడు నెరవేర్చును , . వత్సా! శివుడు సర్వేశ్వరుడే అయిననూ, ఈ అవతారములో విశేషించి ఆ ప్రాంతమునకు ప్రభువై వెలసినాడు ఈ శివావతారము కోర్కెల నన్నిటినీ ఈడేర్చునని ప్రసిద్ది . గొప్ప లీలలను నెరపు శంభుమహాప్రభుడు భీమశంకరుడను పేర ఆరవ సారి అవతరించి భీమాసురుని సంహరించినాడు . సుదక్షిణుడను పేరుగల భక్తుడగు కామరూప దేశప్రభువును, భక్తులకు దుఃఖమును కలుగజేయు భయంకరుడగు భీమాసురుని బారినుండి ఆయన రక్షించెను . ఆ రాజుయొక్క ప్రార్థనను మన్నించి శంకరుడు డాకినీ నగరములో భీమశంకరుడను పేర జ్యోతిర్లింగమై స్వయముగా వెలసియున్నాడు . ఓ మునీ! సర్వ బ్రహ్మాండస్వరూపుడు, భుక్తిని ముక్తిని ఇచ్చువాడు నగు శంకరుడు కాశీనగరములో విశ్వేశ్వరుడై ఏడవ జ్యోతిర్లింగముగా అవతరించినాడు.


విష్ణువు మొదలగు సర్వదేవతలు, కైలాసగిరీశుడు మరియు భైరవుడు కూడ ఆయనను నిత్యము భక్తితో పూజించెదరు . ముక్తి దాతయగు శివప్రభుడు స్వీయనగరమలో స్వయంభూజ్యోతిర్లింగ స్వరూపుడై వెలసియున్నాడు . ఎవరైతే కాశీనగరమును, విశ్వేశ్వరుని ఆరాధించి భక్తితో శివుని నామమును జపించెదరో వారు సర్వదా కర్మ బంధమునుండి విముక్తులై కైవల్యపదమును పొందెదరు . చంద్రమౌళి యెక్క ఎనిమిదవ త్ర్యండకావతారము గౌతమి మహర్షి ప్రార్థించగా గౌతమీ నదీ తీరమునందావిర్భవించెనను . గౌతమ మహర్షి ప్రార్థనచే ఆ మహర్షికి ప్రీతిని కలిగించ గోరి శివుడు జ్యోతిర్లింగ రూపములో అచట స్థిరముగా నున్నాడు . ఆశ్చర్యము! ఆ మహేశ్వరుని దర్శించి స్పృశించువారలకు కోర్కెలన్నియూ ఈడేరుటయే గాక, దేహ త్యాగము తరువాత ముక్తి కలుగును . శివునకు ప్రియురాలు పావనియగు గంగ శివుని అనుగ్రహము వలన గౌతమునకు ప్రీతిని కలిగించుటకై అచట గౌతమి యను పేరుతో ప్రవహించెను .


ఆ జ్యోతిర్లింగములలో తొమ్మిదవ అవతారము వైద్యనాథుడు. అనేకలీలలను ప్రకటించు ఆ ప్రభుడు రావణుని కొరకై ఆ రూపములో ఆవిర్భవించినాడు . రావణుడు తనను గొని పోవుట అను మిషను ఆధారముగా చేసుకొని మహేశ్వరుడు చితాభూమియందు జ్యోతిర్లింగ స్వరూపములో వెలసి యున్నాడు . వైద్యనాథేశ్వరుని పేరు ముల్లోకములలో ప్రసిద్థిని గాంచెను. ఆయనను భక్తితో దర్శించి పూజించు వారలకు ఆయన భుక్తిని ముక్తిని కూడ ఇచ్చును . ఓ మహర్షీ ! వైద్యనాథేశ్వరుని రూపములో అవతరించిన శివుని మహత్మ్యమును మరియు ఈ ఉపదేశమును పఠించువారలకు మరియ వినువారలకు కూడ భుక్తి, ముక్తి లభించును . పదియవ అవతారము నాగేశ్వరుడని కీర్తింపబడినాడు. సర్వదా దుష్టులను శిక్షించు శివుడు తన భక్తుని కొరకై ఆ రూపములో ఆవిర్భవించినాడు. ఆయన ధర్మవిధ్వంసియగు దారుకాసురుని సంహరించి వైశ్యప్రభువు, తనకు భక్తుడు అగు సుప్రియుని రక్షించెను . అనేక లీలలను ప్రకటించు ఆ శంభు ప్రభుడు లోకములకు ఉపకారమును చేయుట కొరకై పార్వతితో గూడి జ్యోతిర్లింగరూపములో ప్రకటమై స్థిరముగా నెలకొనెను .


ఓ మునీ ! నాగేశ్వరుడను పేరు గల శివలింగమును చూచి అర్చించినచో, వెంటనే మహాపాపముల గుట్టలైననూ పూర్తిగా నశించును . శివుని పదకొండవ అవతారము రామేశ్వరుడని స్మరింపబడినది. ఓ మునీ ! రామునిచే స్థాపించ బడిన ఆ రామేశ్వరుడు రామచంద్రునకు హితమును కల్గించినాడు . భక్త ప్రియుడగు ఆ శంకరుడు లింగరూపములో ఆవిర్భవించి మిక్కిలి సంతసించినవాడై రామునకు విజయమును వరముగా నిచ్చెను . ఓ మునీ! రామునిచే సేవింపబడిన ఆ శివుడు రామునిచే అధికముగా ప్రార్థింపబడి సేతుబంధమునందు స్థిరముగా వెలసెను . రామేశ్వరుని మహిమ అద్భుతమేనది. భూలోకములో దాని సాటి మరియొకటి లేదు. రామేశ్వరుడు సర్వదా భక్తులకు కామములను, భుక్తిని, ముక్తిని కూడ ఇచ్చుచుండును . ఏ మానవుడు ఆయనను గంగా జలముతో మహాభక్తి పూర్వకముగా అభిషేకించునో, ఆ మానవుడు ఆ రామేశ్వరుని అనుగ్రహముచే జీవన్ముక్తుడగును . అట్టివాడు ఇహలోకములో దేవతలకు కూడ దుర్లభమగు భోగములన్నిటినీ అనుభవించి దేహత్యాగానంతరము పరమ జ్ఞానమును మోక్షమును పొందును.


శంకురుని పన్నెండవ అవతారము ఘుశ్మేశ్వరుడు. భక్తవత్సలుడగు శివుడు అనేకలీలలను ప్రకటించి ఘుశ్మకు ఆనందమును కలిగించెను . ఓ మునీ! దక్షిణ దిక్కునందు దేవశైలమునకు సమీపములో శివుడు సరస్సునందు ఆవిర్భవించి ఘుశ్మకు ప్రీతిని కలిగించినాడు . ఓ మహర్షీ! సుదేహ ఘశ్మయొక్క పుత్రుని సంహరించగా, అమెభక్తికి భక్త వత్సలుడగు శంభుడు సంతసించి ఆతనిని పూర్తిగా రక్షించెను . ఆమె ప్రార్థించగా ఆ శంభుడు ఆమె కోర్కెను ఈడేర్చువాడై అచటి సరస్సులో ఘుశ్మేశ్వురుడను పేర జ్యోతిర్లింగరూపుడై వెలసెను . ఆ శివలింగమును దర్శించి భక్తితో ఆరాధించు వ్యక్తి ఇహలోకములో సుఖములనన్నిటినీ అనుభవించి తరువాత ముక్తిని కూడ పొందును . ఈ తీరున నేను నీకు భుక్తిని ముక్తిని ఇచ్చే దివ్యమగు పన్నెండు జ్యోతిర్లింగముల క్రమమును చక్కగా చెప్పియుంటిని . ఈ జ్యోతిర్లింగవృత్తాంతమును ఎవడు పఠించునో, లేక వినునో వాడు పాపములన్నింటి నుండి విముక్తుడై భుక్తిని మరియు ముక్తిని పొందును . నేను ఇంతవరకు శతరుద్రసంహితను వర్ణించితిని. కోర్కెలనన్నిటినీ ఈడేర్చి ఫలములనిచ్చే ఈ సంహితయందు వంద అవతారముల పుణ్యకీర్తి వర్ణింపబడినది . ఎవడైతే దీనిని నిత్యము పఠించునో లేదా సమాహితచిత్తుడై వినునో, వాడు అభీష్టముల నన్నింటినీ పొంది పిదప నిశ్చయముగా ముక్తిని పొందును .


శ్రీ శివమహాపురాణములో శతరుద్ర సంహితయందు ద్వాదశజ్యోతిర్లింగ వర్ణనమనే నలుబది రెండ అధ్యాయము.

No comments:

Post a Comment