Sunday, November 29, 2020

అంధకాసుర కృత శ్రీ శివ స్తోత్రం - శ్రీ శివమహాపురాణము

 అంధకాసుర కృత  శ్రీ శివ స్తోత్రం




-------------------------------------------------

-------------------------------------------------


మహాదేవం విరూపాక్షం చంద్రార్ధ కృతశేఖరమ్‌ | అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినమ్‌ || 6

వృషభాక్షం మహా జ్ఞేయం పురుషం సర్వకామదమ్‌ | కామారిం కామదహనం కామరూపం కపర్దినమ్‌ || 7

విరూపం గిరిశం భీమం స్రగ్విణం రక్త వాసనమ్‌ | యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినమ్‌ || 8


మహాదేవుడు, బేసి కన్నులవాడు, చంద్రవంకతో ప్రకాశించే శిరస్సు గలవాడు, అమృత స్వరూపుడు, నిత్యుడు, కూటస్థుడు, నల్లని కంఠము గలవాడు, పినాకధారి (6), వృషభముయొక్క కన్నులు వంటి కన్నులు గలవాడు, జ్ఞేయబ్రహ్మ రూపుడు, చేతనుడు, కోర్కెలనన్నిటినీ తీర్చు వాడు, కాముని దహించి సంహరించిన వాడు, యథేచ్ఛారూపము గలవాడు, జటాధారి (7), వికృతరూపుడు, కైలాసవాసి, భయంకరుడు, మాలను ధరించినవాడు, ఎర్రని వస్త్రములు గలవాడు, యోగి, కాలాంతకుడు, త్రిపురారి, కపాల ధారియగు శివుని ఆతడు ధ్యానించెను (8).



గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరమ్‌ | అణిమాదిగుణాధారం త్రిలోక్యైశ్వర్య దాయకమ్‌ || 9

వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలం పటుమ్‌ | మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరమ్‌ || 10

త్రైలోక్యద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనమ్‌ | కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాససమ్‌ || 11

గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణమ్‌ | దద్యాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితమ్‌ || 12

అఘోరం ఘోరదైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిమ్‌ | భస్మాంగం జటిలం శుద్ధం భేరుండశతసేవితమ్‌ || 13

భూతేశ్వరం భూతనాథం పంచభూతాశ్రితం ఖగమ్‌ | క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియమ్‌ || 14

చండం తుంగం గరుత్మంతం నిత్యమాసవభోజనమ్‌ | లేనిహానం మహారౌద్రం మృత్యుం మృత్యోరగోచరమ్‌ || 15

మృత్యోర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్య వాసినమ్‌ | రాగం విరాగం రాగాంధం వీతారాగశతార్చితమ్‌ || 16

సత్త్వం రజస్తమోధర్మమధర్మం వాసవానుజమ్‌ | సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకమ్‌ || 17

అర్ధనారీశ్వరం భానుం భాను కోటీశతప్రభమ్‌ | యజ్ఞం యజ్ఞ పతిం రుద్రమీశానం వరదం శివమ్‌ || 18

అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః | శివస్య దానవో ధ్యాయన్‌ ముక్తస్తస్మాన్మహా భయాత్‌ || 19

దివ్యేనామృతవర్షేణ సోభిషిక్తః కపర్దినా | తుష్టేనమోచితం తస్మా చ్ఛూలాగ్రా దవరోపితః || 20



రహస్యమగు వ్రతము మరియు మంత్రము గలవాడు, గంభీరమైన వాడు, మనస్సులో సాక్షాత్కరించువాడు, అణిమ మొదలగు అష్టసిద్ధులకు ఆధారమైన వాడు, ముల్లోకములకు ఐశ్వర్యము నిచ్చువాడు (9). వీరుడు, శత్రు వీరులను సంహరించువాడు, భయంకరాకారుడు, వికృతరూపుడు, బలిసి యున్నవాడు, సమర్థుడు, మాంసభక్షకుడు ఉన్మత్తునివలె నున్నవాడు అగు భైరవుడు, మహేశ్వరుడు (10), ముల్లోకములను సంహరించువాడు, లోభి, కిరాతుడు, యజ్ఞనాశకుడు, కార్తికేయునితో గూడి యున్నవాడు, ఉన్మత్తుడు, చర్మమే వస్త్రముగా గలవాడు (11), గజ చర్మ ఉత్తరీయముగా గలవాడు, క్షోభను పొంది సృష్టిని చేయువాడు, పాములే ఆభరణములుగా గలవాడు, సహకారము నిచ్చువాడు, వేతాళుడు, శాకినిచే పూజింపబడే భయంకరమగు ఆకారము గలవాడు (12), సౌమ్యరూపుడు, భయంకరులగు రాక్షసులను సంహరించువాడు, భయంకరమగు సింహనాదమును చేయువాడు, వృక్షములో నుండువాడు, భస్మను ధరించువాడు, జటాధారి, నిత్యశుద్ధుడు, అనేక భేరుండములచే సేవింపబడు వాడు (13), భూతములకు ప్రభువు, ప్రాణులకు తండ్రి, పంచభూతములకు కారణమైనవాడు, ఆకాశరూపుడు, కోపించి హానిని కలిగించే భయంకరుడు, చండీ దేవికి ప్రియుడగు భర్త (14), ఉన్నతమైన వాడు, గరుత్ముంతుని రూపములో నున్నవాడు, నిత్యము అమృతమే భోజనముగా గలవాడు, ముల్లోకములను అవలీలగా సంహరించే మహారుద్రస్వరూపుడు, మృత్యు రూపుడు, మృత్యువునకు అతీతుడు (15), మృత్యువునకు మృత్యువు, మహాసేనానాయకుడు, శ్మశానమునందు అరణ్యమునందు నివసించువాడు, రాగము గలవాడు, విరాగి, రాగముచే వివేకమును గోల్పోయినట్లు కన్పట్టువాడు, అనేకులగు వైరాగ్యసంపన్నులైన జ్ఞానులచే అర్చింపబడువాడు (16), సత్త్వరజస్తమోగుణములకు ధర్మాధర్మములకు అధిష్ఠానమైనవాడు, ఇంద్రుని తమ్ముడు (విష్ణువు), సత్య-అసత్యములకు సత్‌ (కార్య) - అసత్‌ (కారణ)లకు అధిష్ఠానమైన వాడు, జన్మ లేనివాడు (17), అర్ధనారీశ్వరుడు, సూర్యుడు, వందకోటి సూర్యుల కాంతి గలవాడు, యజ్ఞరూపుడు, యజమాన రూపుడు, రుద్రుడు ఈశానుడు, వరములనిచ్చువాడు, మంగళకరుడు (18) అగు పరమాత్మ యొక్క నూట ఎనిమిది రూపములను ధ్యానించి ఆ రాక్షసుడు ఆ మహాభయమునుండి విముక్తుడయ్యెను (19). అపుడు జటాజూట ధారియగు శివుడు సంతసించి శూలాగ్రమునుండి క్రిందకు దింపి విముక్తుని చేసి దివ్యమగు ఆమృత వర్షముతో ఆతనిని అభిషేకించెను (20). 



-------------------------------------------------


అంధక ఉవాచ |

భగవన్‌ యన్మయోక్తోసి దోనోదీనః పరాత్పరః | హర్షగద్గదయా వాచా మయా పూర్వం రణాజిరే || 26

యద్యత్కృతం విమూఢత్వాత్కర్మ లోకేషు గర్హితమ్‌ | అజానతా త్వాం తత్సర్వం ప్రభో మనసి మా కృథాః || 27

పార్వత్యామపి దుష్టం యత్‌ కామదోషాత్‌ కృతం మయా | క్షమ్యతాం మే మహాదేవ కృపణో దుఃఖితో భృశమ్‌ || 28

దుఃఖితస్య దయా కార్యా కృపణస్య విశేషతః | దీనస్య భక్తి యుక్తస్య భవతా నిత్యమేవ హి || 29

సోహం దీనో భక్తియుక్త ఆగతశ్శరణం తవ | రక్షా మయి విధాతవ్యా రచితోయం మయాంజలిః || 30

ఇయం దేవీ జగన్మాతా పరితుష్టా మమోపరి | క్రోధం విహాయ సకలం ప్రసన్నా మాం నిరీక్షతామ్‌ || 31

క్వాస్యాః క్రోధః క్వ కృపణో దైత్యోహం చంద్రశేఖర | తత్సోఢా నాహ మర్ధేందు చూడ శంభో మహేశ్వర || 32

క్వ భవాన్పరమోదారః క్వ చాహం వివశీకృతః | కామక్రోధాదిభిర్దోషైర్జరసా మృత్యునా తథా || 33

అయం తే వీరకః పుత్రో యుద్ధశౌండో మహాబలః | కృపణం మాం సమాలక్ష్య మా మన్యువశమన్వగాః || 34

తుషార హార శీతాంశు శంఖ కుందేందు వర్ణభాక్‌ | పశ్యేయం పార్వతీం నిత్యం మాతరం గురుగౌరవాత్‌ || 35

నిత్యం భవద్భ్యాం భక్తస్తు నిర్వైరో దేవతైస్సహ | నివసేయం గణౖస్సార్ధం శాంతాత్మా యోగచింతకః || 36

మా స్మరేయం పునర్జాతం విరుద్ధం దానవోద్భవమ్‌ | త్వత్కృపాతో మహేశాన దేహ్యేతద్వరముత్తమమ్‌ || 37

అంధుకుడిట్లు పలికెను -

హే భగవన్‌! నేను పూర్వము యుద్ధరంగములో ఆనందాతిరేకముతో గద్గదమైన వచనములతో పరాత్పరుడవగు నిన్ను దీనులలో దీనునిగా భావించి ఏవేవో పలికితిని (26). ఓ ప్రభూ! నీ స్వరూపము నెరుంగక నేను పరమ మూఢుడనై లోకములలో నిందింపబడే ఏయే కర్మలను చేసితినో, ఆ సర్వమును నీవు మనస్సులో పెట్టు కొనవద్దు (27). ఓ మహాదేవా! పార్వతి విషయములో కామమనే దోషమువలన నేను ఏయే తప్పులనాచరించితినో, వాటిని కూడ క్షమించవలెను. నేను దీనుడను, మిక్కిలి దుఃఖించుచున్నాను (28). దుఃఖితుడు, దీనుడు అగు భక్తునియందు నీవు సర్వదా విశేషమగు దయను చూపదగును (29). నేను దీనుడను, భక్తుడను; నిన్ను శరణు వేడుచున్నాను. చేతులు జోడించి నమస్కరించుచున్నాను. నన్ను రక్షించుము (30). జగన్మాతయగు ఈ దేవి నాపై కోపమును విడనాడి సంతోషముతో ప్రసన్నవీక్షణములను నాపై బరపుగాక! (31) ఓ చంద్రశేఖరా! శంభో! మహేశ్వరా! ఆమె క్రోధమెక్కడ? దీనుడను, రాక్షసుడను అగు నేనెక్కడ? నేను ఆమె కోపమును భరించలేను (32). పరమదయామూర్తివగు నీవెక్కడ? కామక్రోధాది దోషములకు, జరామృత్యువులకు పూర్తిగా వశుడనై ఉండే నేనెక్కడ? (33) నీ పుత్రుడగు ఈ వీరకుడు మహాబలశాలి, యుద్ధములో దక్షుడు. దీనుడనగు నన్ను గాంచి ఈతడు క్రోధమును చేయకుండు గాక! (34) మంచు, ముత్యాలహారము, చంద్రుడు, శంఖము, మల్లెపువ్వు వలె స్వచ్ఛమగు వర్ణము గలవాడా! తల్లియగు పార్వతిని నేను సర్వదా మహాగౌరవముతో చూడగలను (35). నేను దేవతలతో వైరమును మాని, శాంతమగు మనస్సుతో యోగమును గురించి ఆలోచిస్తూ, మీ ఇద్దరితో మరియు గణములతో కలిసి భక్తి పూర్వకముగా జీవించెదను (36). ఓ మహేశ్వరా! నీ కృపచే నేను దానవవంశములో పుట్టుట వలన కలిగిన విరుద్ధ స్వభావమును పూర్తిగా మరచిపోయెదను. నాకీ ఉత్తమమగు వరము నిమ్ము (37).


-------------------------------------------------

మహాదేవుడు, విరూపాక్షుడు,చంద్రశేఖరుడు,  అమృతుడు,శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు  పినాకి,వృషభాక్షుడు,మహాగ్నేయుడు,పురుషుడు  సర్వ కామదడు,కామారి,కామదాహనుడు,  కామరూపుడు,కపర్ది,విరూపుడు,గిరిశుడు,  భీముడు,శృక్కి,రక్తవస్త్రుడు,యోగి,కామదహనుడు  త్రిపురఘృడు,కపాలి,గూఢవృతుడు,  గుప్త మంత్రుడు,గంభీరుడు,భావగోచరుడు   అణిమాదిగుణాధారుడు,   త్రైలోక్యైశ్వర్యదాయకుడు,వీరుడు,వీరహనుడు  ఘోరుడు,విరూపుడు,మాంసలుడు,పటువు  మహామాంసాదుడు,ఉన్మత్తుడు,భైరవుడు  మహేశ్వరుడు,త్రైలోక్యద్రావణుడు,బుద్ధుడు  లుబ్దకుడు,యఘ్నసూదనుడు,ఉన్మత్తుడు  కృత్తివాసుడు,గజకృత్తిపరిధానుడు,క్షుబ్దుడు  భుజంగభూషణుడు,దత్తాలంబుడు,వీరుడు  కాశినీపూజితుడు,అఘోరుడు,ఘోరదైత్యఘృడు  ఘోర ఘౌషుడు,వనస్వతిరూపుడు,భస్మాంగుడు  జటిలుడు,శుద్దుడు,భేరుండకతసేవితురు,  భూతేశ్వరుడు,భూతనాదుడు,  పంచభూతాశ్రితుడు,ఖగుడు,క్రోధితుడు  విష్ణులుడు,చండుడు,చండీశుడు,  చండికాప్రియుడు,చండుడు,గరుత్మంతుడు  అసవభోజనుడు,నేవిహనుడు,మహారౌద్రుడు  మృత్యువు,మృత్యుఅగోచరుడు,  మృత్యుమృత్యువు,మహాసేనుడు,స్మశానవాసి  అరణ్యవాసి,రాగస్వరూపుడు,విరాగస్వరూపుడు  రాగాందుడు,వీతరాగశతార్చితుడు,సత్వగుణుడు  రజోగుణుడు,తమోగుణుడు,అథర్ముడు,  వాసవానుజుడు,సత్యుడు,అసత్యుడు,  సద్రూపుడు,అసద్రూపుడు,అహేతుకుడు,  అర్ధనారీశ్వరుడు,భానువు,భానుకోటిశతప్రభుడు  యజ్ఞస్వరూపుడు,యజ్ఞపతి,రుద్రుడు,ఈశానుడు  వరదుడు,నిత్యుడు,శివుడు.

-------------------------------------------------



శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధ ఖండలో అంధకునకు గణాధ్యక్షపదవి లభించుట అనే నలుబది తొమ్మిదవ అధ్యాయము

No comments:

Post a Comment