శుక్రచార్య కృత శ్రీ శివ స్తోత్రము
ఓం నమస్తే దేవేశాయ సురాసురనమస్కృతాయ
భూతభవ్యమహా దేవాయ హరితపింగలలోచనాయ
బలాయ బుద్ధిరూపిణే
వైయాఘ్రవసనచ్ఛదాయారణేయాయ
త్రైలోక్యప్రభవే ఈశ్వరాయ హరాయ హరితనేత్రాయ
యుగాంతకరణాయానలాయ గణేశాయ లోకపాలాయ
మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంష్ట్రిణే
కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ
మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ
సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే
వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ
శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే
మహాయశసేభూతేశ్వరాయ గుహావాసినే వీణా పణవతాలవతే
అమరాయ దర్శనీయాయ బాలసూర్యనిభాయ శ్మశానవాసినే
భగవతే ఉమా పతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే
పూష్ణోదశననాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ
ప్రలయకాలాయ ఉల్కాముఖాయాగ్ని కేతవే మునయే దీప్తాయ
విశాంపతయే ఉన్నతయే జనకాయ చతుర్థకాయ లోకసత్తమాయ
వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే
జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ
క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే
మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి
సమాశ్రమ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే
పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ
త్రివర్త్మనే భూతభావనాయ త్రినేత్రాయ
బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ
దేవాయ సర్వతూర్యనినాదినే సర్వబాధా
విమోచనాయ బంధనాయ సర్వధారిణే
ధర్మోత్తమాయ పుష్పదంతాయావి భాగాయ
ముఖ్యాయ సర్వహరాయ హిరణ్యశ్రవసే ద్వారిణే
భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో నమః || 1
సనత్కుమారుడిట్లు పలికెను -
ఓం దేవదేవుడు, దేవతలచే, రాక్షసులచే నమస్కరింపబడువాడు, భూత భవిష్యత్కాలములలోని ప్రాణులకు గొప్ప దైవము, పచ్చని మరియు తేనెరంగు గల కన్నులు గలవాడు, బలశాలి, బుద్ధిస్వరూపుడు, వ్యాఘ్రచర్మమే ఉత్తరీయముగా గలవాడు, అరణినుండి పుట్టిన యజ్ఞాగ్నియే స్వరూపముగా గలవాడు, ముల్లోకములకు ప్రభువు, ఈశ్వరుడు, పాపహారి, పచ్చని కన్నులు గలవాడు, ప్రళయకాలాగ్ని స్వరూపుడు, గణాధ్యక్షుడు, లోకములను పాలించువాడు, గొప్ప భుజములు చేతులు గలవాడు, శూలధారి, గొప్ప దంష్ట్రలు గలవాడు, మృత్యుస్వరూపుడు, మహేశ్వరుడు, వినాశము లేనివాడు, నల్లని కంఠము గలవాడు, గొప్ప ఉదరము గలవాడు, సర్వస్వరూపుడు, సర్వకారణుడు, సర్వవ్యాపి, మృత్యుంజయుడు, పారియాత్ర పర్వతముపై గొప్ప తపస్సును చేసినవాడు, బ్రహ్మచారి, వేదాంత ప్రతిపాద్యుడు, తపస్సు యొక్క అవధులను దాటిన వాడు, జీవులకు పాలకుడు, నిరవయవుడు, వృషభము ధ్వజమునందు గలవాడు, జటాధారి, జుట్టుముడి గలవాడు, దండధారి, గొప్ప కీర్తి గలవాడు, భూతపతి, గుహయందు ఉండువాడు, వీణపై మృదంగముపై తాళములను పలికించువాడు, అవినాశి, సుందరాకారుడు, బాలసూర్యుని వలె ప్రకాశించువాడు, శ్మశానమునందు నివసించు వాడు, భగవాన్ పార్వతీపతి, శత్రుసంహారకుడు, భగుని కన్నులను పూష దంతములను బెరికిన వాడు, దుష్టసంహారకుడు, పాశధారి, ప్రలయకాల మృత్యుస్వరూపుడు, ఉల్క నోటియందు గలవాడు, అగ్నియే ధ్వజముగా గలవాడు, మననశీలి, ప్రకాశస్వరూపుడు, మానవులకు ప్రభువు, ఎత్తైన దేహము గలవాడు, తండ్రి, త్రిమూర్తుల కతీతుడు, భువనములలో సర్వశ్రేష్ఠుడు, వామదేవుడు, వక్తలలో శ్రేష్ఠుడు, భిక్షురూపధారియై వామార్ధమునందున్న అన్నపూర్ణనుండి భిక్షను గోరువాడు, తెలియ శక్యము కాని స్వరూపము గలవాడు, ఇంద్రుని చేతులను స్తంభింప జేసినవాడు, యజ్ఞస్వరూపుడు, యజమానస్వరూపుడు, మృత్యుస్వరూపుడు, జ్ఞాననిధి, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమస్వరూపుడు, సర్వాశ్రమముల వారిచే వాజసన నామముతో పూజింపబడువాడు, జగత్తును సృష్టించి పోషించే శాశ్వత కూటస్థ పరబ్రహ్మ స్వరూపుడు, ధర్మమునకు అధ్యక్షుడు, ఉత్తర-దక్షిణ-అధో మార్గములు గలవాడు, ప్రాణులను సృష్టించువాడు, ముక్కంటి, అనేక రూపుడు, పదివేల సూర్యులతో సమమగు తేజస్సు గలవాడు, ప్రకాశస్వరూపుడు, సర్వవాద్యముల ధ్వనులు గలవాడు, బాధలనన్నింటి నుండియు విముక్తిని కలిగించువాడు, సంసారములో బంధించువాడు, ఉత్తమమగు ధర్మస్వరూపుడు, పుష్పదంతస్వరూపుడు, ద్వైతవర్జితుడు, త్రిమూర్తులలో ముఖ్యుడు, సర్వమును హరించువాడు, బంగరు వర్ణముగల చెవులు గలవాడు, ద్వారదేవతారూపుడు, భయంకరుడు, భయంకరమగు పరాక్రమము గలవాడు, ఓంకారస్వరూపుడు అగు శివునకు అనేక వందనములు (1).